తిరుమల, సెప్టెంబర్ 11:
మన జ్ఞానం అందరికీఉపయోగపడాలి. ఎందుకంటే మనం సాధించాలనుకొన్న కార్యంలో సన్నిహితులు మనకు సహాయంచేస్తారు. అప్పుడు మన సాధనసులువవుతుంది.జ్ఞానాన్ని
సముపార్జించాలి. అ మనకు మార్దర్శనం చేస్తుంది. అది మనవరకే కాకుండా నలుగురితో పంచుకోవాలి.
నువ్వు ఈ కార్యం సాధించగలవు అంటూ హితులు, మిత్రులు, సహచరులు ధైర్యం చెబితేనే హనుమ సముద్రం దాటి లంకకు చేరి కార్యం సాధించుకొని వచ్చి ‘చూశాను సీతను’ అనగలిగాడు.
మనం ఏదైనా గొప్ప కార్యాన్ని తలపెట్టి
పూర్తి చేయాలనుకొంటే మనకో మంచి స్నేహితుడు ఉండాలి. అతడు విమర్శకుడు, మార్గదర్శకుడైతే ఎన్నో మంచి మాటలను ఉపదేశిస్తాడు. అప్పుడు మనం అనుకొన్న సాధన సఫలమై తీరుతుంది. మనందరిలో ప్రత్యేకత ఉంది. కానీ, దాన్ని కనిపెట్టే తీరిక ఓపిక ఉంటే ఏది సాధించడంలోనైనా మనలో ప్రాజ్ఞత వికసిస్తుంది. సూర్యవంశానికి చెందిన భగీరథుడు సగరుడి వారసులకు ఉత్తమ గతులను కలగజేసేందుకు దివిజ గంగను భువికి తెచ్చే మహా ప్రయత్నం చేశాడు.
ఈ సాధననే భగీరథ సాధన అన్నారు. ప్రతి మనిషీ అద్భుతంగా జీవించాలని ఆదిశంకరాచార్యులు తరచూ అనేవారట. అలా బతికితే ప్రతి రోజూ సాధనకు మనసు ఉరకలు వేస్తుంది. రాబోయే రోజులన్నీ ఆశాజ్యోతులవుతాయి. ఆదిశంకరులు దేశాన్ని మొత్తం కాలినడకన పర్యటించి తాను తలపెట్టినట్లు నాలుగు పీఠాలను నెలకొల్పగలిగారు. పాశ్చాత్య పురాణాల్లోని నాయకులు కండబలం కలవారు. మన భారతీయ ఇతిహాసాల్లో ధీరులు నైతికంగా ధార్మికంగా బలవంతులు. కండబలం కంటే గుండెబలం మనోబలం శక్తిమంతమైనవి.
















