బిహార్ లో అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ప్రక్రియపై రాజకీయ పక్షాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులు (సీఈవో)లతో ఈసీ భేటీ కాబోతున్నది. ఇది రెగ్యులర్ మీటింగ్ అని ఈ సమావేశంలో ఎస్ఐఆర్ తో పాటు గత సమావేశాల మాదిరిగానే అన్ని అంశాలపై చర్చించబోతున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.
ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం!:
ఓట్ చోరీ అంశంలో ప్రతిపక్షాలు ఈసీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈసీ- బీజేపీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను చోరీ చేస్తోందని రాహుల్ గాంధీ నేరుగా ఎటాక్ చేస్తున్నారు. బిహార్ లో ఎస్ఐఆర్ కూడా ఇందులో భాగమేనని వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఈసీ.. బిహార్ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది. అయితే ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చేపట్టాలని గత జూలైలోనే ఈసీ నిర్ణయం తీసుకుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన జరగబోయే సమావేశంలో ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.
















