హైదరాబాద్:
యాకత్ పురాలో చోటు చేసుకున్న ఓ ప్రమాదకర సంఘటనపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు. మౌలాకా చిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక ఓపెన్ గా ఉన్న మ్యాన్ హెూల్లో పడిపోయిన ఘటన స్థానికులను, అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే, అదృష్టవశాత్తూ అక్కడే
ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారిని బయటకు తీశారు. ఈ ఘటనలో బాలికకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే లోకల్ డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం చిన్నారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న హైడ్రా సిబ్బంది మ్యాన్ హెూల్ను శుభ్రం చేసిన తర్వాత, తిరిగి మూయకుండా అక్కడి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనను హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చార్మినార్ జోనల్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
















